రక్తం ఒక ద్రవ రూప కణజాలం.మన రక్తంలో 55% ద్రవ రూప ప్లాస్మాతోనూ,మరో 45% వివిధ రకాల కణాలతో కలిపి ఉంటుంది.రక్త కణాల్లో ప్రధానంగా ఎర్ర రక్త కణాలు , తెల్ల రక్త కణాలు , రక్త కణ ఫలకికలు / ప్లేట్ లెట్స్ ఉంటాయి.
కాగా రక్తంలోని ప్లాస్మాలో 92% నీరు ఉంటే ,ప్రొటీన్లు , అయాన్లు వంటివన్నీ కలిపి మిగతా 8% ఉంటాయి.ఐతే ఇది అన్ని రకాల జీవులకు ఒకే విధంగా ఉండదు.ఒకే కుటుంబానికి చెందిన జీవులైనప్పటికీ ,అవి వేర్వేరు రకాలకు చెందినవైనప్పుడు వాటి రక్త సాంద్రత కూడా వేర్వేరుగా ఉంటుంది.అలాగే ఆడ జీవుల రక్త సాంద్రతకు ,మగ జీవుల రక్త సాంద్రతకు తేడా స్పష్టంగా ఉంటుంది.మనం ఉండే భంగిమను బట్టి శరీరంలోని వివిధ అవయవాల వద్ద రక్త సాంద్రతలో తేడా ఉంటుంది.ఉదాహరణకు కూర్చున్నప్పటికన్నా నిలబడి ఉన్న సమయంలో మన శరీరంలోని కొన్ని ప్రాంతాలలో రక్త సాంద్రత హెచ్చుగా ఉంటుంది.రక్తం నిర్వహించే ధర్మాన్ని బట్టి మొత్తం జంతువులను ప్రధానంగా ఉష్ణ రక్త జీవులు , శీతల రక్త జీవులుగా వర్గీకరించారు.మనం ఉష్ణ రక్త జీవుల కిందికి వస్తాము.ఈ కోవకు చెందిన జంతువుల ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది.ఆ విధంగా చేసే యంత్రాంగం ,ఏర్పాట్లు వాటి శరీరంలో ఉంటాయి.ఇక శీతల రక్త జీవుల శరీర ఉష్ణోగ్రత పరిసరాల ఉష్ణోగ్రతను బట్టి మారిపోతూ ఉంటుంది.ఏదేమైనా మేధస్సు విషయంలో శీతల రక్త జీవుల కన్నా ఉష్ణ రక్త జీవులు ముందంజలో ఉన్నాయి.
No comments:
Post a Comment